బాలు కన్నుమూత : ఫేక్ వార్తలపై చరణ్ ఆగ్రహం 

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి యావత్‌ సినీ, సంగీత ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కరోనా సోకడంతో ఆగస్టు 5న ఎస్పీబీ చెన్నైలోనే ఎంజీఎం హెల్త్‌కేర్‌లో చేరారు. తొలినాళ్లలో కోలుకున్నట్లు కనిపించిన ఆయన ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తూ రావడంతో వెంటిలేటర్‌, ఎక్మోసాయంతో చికిత్స అందించారు. ఆ తర్వాత కరోనా నెగెటివ్‌ వచ్చింది. క్రమంగా కోలుకుంటూ వచ్చారు. ఇలాంటి సమయంలో ఈ నెల 24న మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో 25వ తేదీ మధ్యాహ్నం 1.04గంటలకు తుది శ్వాస విడిచారు. అయితే బాలు వైద్యం, వైద్య ఖర్చులు, ఎంజీఎం ఆసుపత్రి తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

తాజాగా దీనిపై బాలు తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ఓ వీడియో మెసేజ్ విడుదల చేశారు. ‘ఎంజీఎం ఆస్పత్రి గురించి కొన్ని అసత్యవార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా నాన్నగారి వైద్యానికి సంబంధించిన చెల్లించాల్సిన బిల్లులు, టెక్నికల్‌ స్టాఫ్‌ విషయంలో కొన్ని పుకార్లు వస్తున్నాయి. మొత్తం బిల్లు చెల్లించే వరకూ నాన్నగారి భౌతికకాయాన్ని ఇచ్చేది లేదని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు అన్నట్లు కూడా రాసుకొచ్చారు. ఈ వార్తలన్నీ అర్థరహితం. కొందరు ఇలాంటివి ఎందుకు ప్రచారం చేస్తారో అర్థంకాదు.

నాన్నగారికి ఎలాంటి వైద్యం చేశారు? ఆస్పత్రి బిల్లులు ఎవరు? ఎంత చెల్లించారన్న విషయంపై ఆధారాలు లేని ఆరోపణలు చేసే ఆ వ్యక్తికి కనీస జ్ఞానం లేదు. ఆ వివరాలేవీ నేను ఇప్పుడు చెప్పలేను. దీనిపై నేను, ఎంజీఎం ఆస్పత్రి సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తాం. ఇలాంటి వార్తలు ప్రచారం కావడం చాలా చాలా బాధాకరం. నాన్నగారికి చెన్నై ఎంజీఎం ఆస్పత్రి ఇచ్చిన వైద్యం పట్ల మా కుటుంబమంతా ఎంతో కృతజ్ఞతా భావంతో ఉంది’ అని తెలిపారు.