భారత్ బయోటెక్’ని సందర్శించిన గవర్నర్ త‌మిళిసై 

భారత్ బయోటెక్ ‘కరోనా వాక్సిన్’ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. అతి తక్కువ ధరలోనే దేశంలోనే ప్రజలందరికీ కరోనా వాక్సిన్ అందిస్తామని భారత్ బయోటెక్ గతంలోనే తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ కూడా భారత్ బయోటెక్ కరోనా వాక్సిన్ గురించి తమ తమ ప్రసంగాల్లో ప్రస్తావించారు. అతి త్వరలోనే భారత్ బయోటెక్ నుంచి కరోనా వాక్సిన్ వస్తుందని ఆకాక్షించారు. 

తాజాగా  శామీర్‌పేట‌లోని భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ సంద‌ర్శించారు. కొవిడ్ వ్యాక్సిన్ త‌యారీలో భాగ‌స్వాములైన శాస్ర్త‌వేత్త‌ల‌తో గ‌వ‌ర్న‌ర్ మాట్లాడారు. ఈ సందర్భంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌పై అత్యంత శ్ర‌ద్ధ పెట్టి ప‌ని చేస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌ధాని మోదీ చెప్పిన‌ట్లు భార‌త్‌లోనే క‌రోనా వ్యాక్సిన్ త‌యారీకి అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వ్యాక్సిన్ కోసం అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్న శాస్ట్రవేత్తలకి ఈ సందర్భంగా గవర్నర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.