వెబ్ సిరీస్’కు నిర్మాతగా ధోని
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 2019లో విడుదలైన ‘రోర్ ఆఫ్ ది లయన్’ డాక్యుమెంటరీకి ధోనీ నిర్మాణ రంగంలో బాధ్యతలు పంచుకన్న సంగతి తెలిసిందే. ‘ధోనీ ఎంటర్టైన్మెంట్’ సంస్థలో నిర్మించిన ఇది ఓటీటీ వేదికగా విడుదలైంది. అమిర్ రిజ్వి దర్శకుడిగా పనిచేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో రెండేళ్లు లీగ్‌కు దూరమైన చెన్నై జట్టు తర్వాత ఎలా పుంజుకుందనేది డాక్యుమెంటరీ సారాంశం. తాజాగా వెబ్ సిరీస్’కు నిర్మాతగా వ్యవహరించనున్నారు.
ఈ విషయాన్ని ‘ధోనీ ఎంటర్టైన్మెంట్’ ప్రొడక్షన్ హౌస్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న అతడి సతీమణి సాక్షి బుధవారం వెల్లడించారు. ఈ వెబ్‌సిరీస్ థ్రిల్లింగ్ అడ్వెంచర్‌గా ఉంటుందని ఆమె తెలిపారు. ఇంకా ప్రచురితం కానీ ఓ పుస్తకం ఆధారంగా దీన్ని తెరకెక్కించనున్నామన్నారు. ‘పౌరాణిక సైన్స్ ఫిక్షన్ కథే ఈ పుస్తకం. రహస్యమైన అఘోరి తన ప్రయాణం సాగించిన తీరు ఇందులో ఉంటుంది. అయితే ఆ అఘోరి వెల్లడించిన రహస్యాలు.. పురాణాలు, మన నమ్మకాలను మార్చేస్తాయి. విశ్వంలోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ కథలో ప్రతి పాత్రను గొప్పగా తీర్చిదిద్ది తెరపైకి తీసుకువచ్చేలా ప్రయత్నిస్తాం. సినిమా కంటే ఇది వెబ్సిరీస్గానే బాగుంటుంది’ అని సాక్షి అన్నారు.