గర్ల్ ఫ్రెండ్ కోసం.. ఫేస్ బుక్ లో తనని అమ్మకానికి పెట్టుకున్న యువకుడు !

అమ్మాయి కోసం తనని తాను అమ్మకానికి పెట్టుకొన్న ఓ యువకుడి పోస్ట్ వైరల్ అవుతోంది. బ్రిటన్‌లోని నార్తాంప్టన్‌షైర్‌కు చెందిన అలెన్‌ క్లేటన్‌కు చెట్టాపట్టాలేసుకు తిరగడానికి ఒక అమ్మాయి దొరకలేదు. వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌ అయిన అలెన్‌ గత పదేళ్లుగా.. ఓ ప్రియురాలి కోసం చేయని ప్రయత్నాలు లేవు. సామాజిక మాధ్యమాల్లో, డేటింగ్‌ యాప్‌లలో రాత్రీ, పగలూ వెదికాడు. ఒక్క అమ్మాయితోనూ క్లేటన్‌కు జోడీ కుదరలేదు. దీంతో విసిగి వేసారి.. చివరకు తనను తానే అమ్ముకోవాలని నిర్ణయించుకున్నాడు.ఈ మేరకు ఫేస్‌బుక్‌ క్లాసిఫైడ్స్‌లో అమ్మకానికి అలెన్‌ అంటూ సంచలన ప్రకటన ఇచ్చాడు.

‘నా పేరు అలెన్‌.. వయసు 30 సంవత్సరాలు. అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్నా. ఈ మధ్యలో చాలా పెళ్లి వేడుకలకు వెళ్లాల్సి ఉంది. వాటికి ఒంటరిగా వెళ్లాలని అనుకోవడం లేదు. డేటింగ్‌ సైట్లలో అమ్మాయిల కోసం చాలా ప్రయత్నాలు చేశాను. అదృష్టం కలిసిరాలేదు. అందుకే ఈ ప్రయత్నం” అంటూ ఆసక్తికరంగా ఆ ప్రకటన కింద రాసుకున్నాడు. అయినా అదృష్టం అలెన్‌కు కలిసి రాలేదు. చాలా మంది అమ్మాయిలు సందేశాలు పంపినా.. డేటింగ్‌ వరకు దారి తీయలేదు. అయితే తానిచ్చిన ఈ విచిత్రమైన ప్రకటన తనకు మేలు చేస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు.