ఏపీ ప్రభుత్వ పాఠశాలలో 20 మంది విద్యార్థులకి కరోనా
స్కూల్స్ తెరిచే విషయంలో ఏపీ ప్రభుత్వం ఆతృత చూపించింది. ఆగస్టులోనే స్కూల్స్ తెరవాలని ఏపీ ప్రభుత్వం చూసింది. అయితే కేంద్రం నుంచి అనుమతి లేకపోవడం ఆగింది. అయితే ఇప్పుడు విద్యార్థులు కరోనా బారినపడటంతో ప్రభుత్వానికి షాక్ తగిలినట్టయింది. విజయనగరం జిల్లా గంట్యాడలో 20 మంది విద్యార్థులకు కరోనా సోకింది. గంట్యాడ, దత్తి జిల్లా ఉన్నత పాఠశాలల్లోని 9,10 తరగతుల విద్యార్థులకు కరోనా సోకింది.
గత నెల 30న గంట్యాడ ఉన్నత పాఠశాలలో 73 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 20 మందికి నిర్ధరణ అయింది. దత్తిలోని పాఠశాలలో 100 మందిలో ఎనిమిది మందికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఏపీ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్‌తో మంత్రి నాని ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే 20 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని చెప్పారు. లక్షణాలు లేకపోతే విద్యార్థులను హోంక్వారంటైన్‌లో ఉంచాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై రోజూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు. వైద్య కిట్లు అందజేయాలని జిల్లా వైద్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో మాస్కులు, శానిటైజర్లు వినియోగించేలా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.