జగన్’పై భాజాపా అనుమానాలు
వైసీపీ ఎన్డీయేలో చోరబోతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ తాజా ఢిల్లీ టూర్ ఇందుకోసమేనని చెప్పుకొంటున్నారు. అంతేకాదు.. వైసీపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు రాబోతున్నాయని చెబుతున్నారు. భాజాపా అధిష్టానం జగన్ కు రెడ్ కార్పెట్ వేస్తుంటే.. ఏపీ భాజాపా నేతలు మాత్రం ఆయనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల నీటి వివాదాలపై రేపు అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాజెక్టుల వివాదంపై సమావేశంలో చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అనేక ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. వాటిపై అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ అభ్యంతరం చెప్పలేదు.
ప్రస్తుతం జగన్, కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీ సానుకూలంగా స్పందించాలి. ఏపీ అభివృద్ధిలో రాయలసీమది ప్రముఖపాత్ర. ఆ ప్రాంతంలో సాగునీరు లేకుంటే అద్భుత ధాన్యాగారాన్ని కోల్పోతాం. రాయలసీమలో సాగు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు నీరు కేటాయించాలి. ఎవరికీ నష్టం లేకుండా నీటి కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నాం” అని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు.