కాంగ్రెస్’లోకి దుబ్బాక తెరాస అభ్యర్థి
స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి.. 10న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో దుబ్బాకలో పొలిటికల్ హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలు అభ్యర్థిని ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఈ స్థానం నుంచి మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి టికెట్ ఆశించారు. ఆయన దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా స్థానికంగా ప్రచారం మొదలైంది. కానీ తెరాస అధిష్టానం మాత్రం దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికే టికెట్ ఇచ్చేందుకే మొగ్గుచూపుతోంది.
ఈ నేపథ్యంలో చెరకు శ్రీనివాస్ రెడ్డి తెరాసకు షాక్ ఇస్తూ కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ కూడా ఆయన వస్తే దుబ్బాక టికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. దీంతో దుబ్బాక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మరోవైపు ఇన్నాళ్లు దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా.. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరు బలంగా వినిపించింది. ఇప్పుడు మారుతున్న సమీకరణాలతో నర్సారెడ్డిని నిరాశ తప్పేలా లేదు. మొత్తానికి.. దుబ్బాక ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది.