దుబ్బాకలో దూసుకుపోతున్న హరీష్ రావు

హరీష్ రావు – తెరాస ట్రబుల్ షూటర్. ఆయన బరికిలోకి దిగితే ఓటమి అంటూ ఉండదని చెబుతుంటారు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు బాధ్యతని ఆయనే తీసుకున్నారు. తనదైన శైలిలో నెలరోజుల కిందటే ప్రచారం మొదలెట్టారు. దుబ్బాక అభివృద్ది బాధ్యత ఇకపై తనదేనని హామీ ఇచ్చారు. ఆయన హామీతో ఇతర పార్టీల నేతలు కూడా తెరాసలో చేరుతున్నారు.

తాజాగా దుబ్బాక రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు నర్సింహారెడ్డి, మనోహర్‌ రెడ్డి, మరికొంత మంది కాంగ్రెస్‌ నేతలు హరీశ్‌రావు సమక్షంలో తెరాసలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు. ఓట్ల కోసం వచ్చేవాళ్లకు ఓటేద్దామా? లేక కష్టసుఖాల్లో కలిసుండే వారికి ఓటు వేద్దామా? అనే విషయాన్ని ప్రజలను ఆలోచించాలన్నారు.

ఓట్లు వేసే వరకే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దుబ్బాకలో ఉంటారని.. ఓట్లు అయిపోయినా ఇక్కడి ప్రజల మధ్య ఉండేది తెరాసనేనని హరీష్ అన్నారు. దుబ్బాకలో తొలిసారి ఓ మహిళ ఎమ్మెల్యే అవుతుందని అందరూ సంతోషిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు.