అలీనగర్‌లో 4 మృతదేహాలు లభ్యం

హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు పదుల సంఖ్యలో మృతి చెందిన సంగతి తెలిసిందే. వరదల్లో కొట్టుకుపోయిన వారి కోసం రెస్క్యూ టీమ్స్ ఇంకా గాలిస్తున్నానే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని అలీనగర్‌లో బుధవారం సాయంత్రం వరదనీటిలో గల్లంతైన 8 మందిలో 4 మృతదేహాలు లభ్యమయ్యాయి.

అబ్దుల్‌ తాహిర్‌ కుటుంబానికి చెందిన 8 మంది ఇంటి అరుగుపై కూర్చున్న సమయంలో ఒక్కసారిగా వరద నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయారు. గురువారం రాత్రి రెండు మృతదేహాలను ఫలక్‌నుమా సమీపంలోని నాలాలో గుర్తించగా… మరో రెండు మృతదేహాలను ఇవాళ గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. మరో నాలుగు మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్‌ పాతబస్తీ, అసిమాబాద్‌, అల్‌జుబైల్‌ కాలనీ మొత్తం జలదిగ్బంధంలోనే ఉన్నాయి.అసిమాబాద్‌ ప్రాంతంలో దాదాపు 100 గేదె కళేబరాలు బయటపడ్డాయి.