‘800’ వివాదంపై మురళీధరన్ స్పందన
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత కథగా ‘800’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముత్తయ్య పాత్రని విజయ్‌సేతుపతి పోషిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన లుక్ కూడా బయటకు వచ్చింది. అందులో ముత్తయ్యగా విజయ్ లుక్ చూసి, ఫ్యాన్సంతా షాక్ కి గురయ్యారు. ముత్తయ్య లుక్ నూటికి నూరుపాళ్లూ..దించేశాడు విజయ్. అయితే విజయ్ ముత్తయ్యగా మారడాన్ని తమిళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు భారతీరాజా వంటి వారు కూడా విమర్శలు చేస్తున్నారు.
తాజాగా ఈ వివాదంపై మురళీధరన్ స్పందించారు. “ఇప్పటివరకూ జీవితంలో నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. నా వ్యక్తిగత జీవితం, క్రికెట్ జీవితం గురించి చాలా మంది మాటలన్నారు. ఇప్పుడు ‘800’ చిత్రం కూడా నా జీవితం గురించే చర్చిస్తుంది కాబట్టి, దీనిపైనా విమర్శలు వస్తాయి. అయితే, నేను కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను.
ఈ చిత్రాన్ని కొందరు వివిధ కారణాలతో రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారు. నేను ఇదివరకు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి చూపిస్తున్నారు. గత ఏడాది నేను 2009 నాకు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని అన్నాను. అయితే కొందరు దీన్ని వక్రీకరించి ‘శ్రీలంకలో తమిళులను పెద్ద సంఖ్యలో చంపిన ఏడాది మురళీధరన్‌కు అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరమట’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
దయచేసి ఓ సామాన్యుడి కోణంలో ఆలోచించండి. దేశంలో యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఇంతటి ఆందోళనకర పరిస్థితుల్లో 2009లో యుద్ధం సమాప్తమైంది. ఓ సామాన్యుడిగా సురక్షితంగా ఉన్నామన్న భావన నాకు కలిగింది. పదేళ్లుగా ఇరువైపులా మరణాలు లేవు. అందుకే, 2009ని నేను అత్యంత ఆనందం కలిగించిన సంవత్సరం అని అన్నాను. అమాయకులను చంపడాన్ని నేను ఎప్పుడూ సమర్థించలేదు. సమర్థించబోను’ అని అన్నారు. ఇక ఈ వివాదంపై విజయ్ సేతుపతి ఇప్పటి వరకు స్పందించలేదు.