ఐపీఎల్’లో వార్నర్ ఓకే ఒక్కడు..!

ఐపీఎల్ లో హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ లీగ్‌లో 5 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ (47*) పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ 5,037 పరుగుల రికార్డును చేరుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మన్‌గానూ నిలిచాడు. ఇదివరకు 157 ఇన్నింగ్స్‌ల్లో బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 5వేల పరుగుల మైలురాయిని చేరుకోగా.. హైదరాబాద్‌ కెప్టెన్‌ 135 ఇన్నింగ్స్‌ల్లో దాన్ని అధిగమించాడు.

ఇక పరుగుల పరంగా ప్రస్తుతం కోహ్లీ (5,759) అగ్రస్థానంలో నిలవగా తర్వాతి స్థానాల్లో చెన్నై బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా (5,468), ముంబయి సారథి రోహిత్‌ శర్మ (5,149) ఉన్నారు. వారి తర్వాత వార్నర్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక విదేశీ ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా ఏబీ డివిలియర్స్‌ (4,680) కొనసాగుతున్నాడు.