ముక్కు ద్వారా కరోనా టీకా.. భారత్ ప్రయోగాలు !

కరోనా మహమ్మారికి టీకా తీసుకొచ్చే పనిలో ప్రపంచ దేశాలున్నాయి. భారత్ కూడా ప్రయోగాలని వేగవంతం చేసింది. కరోనా వైరస్‌ కట్టడి కోసం ముక్కు ద్వారా ఉపయోగించే టీకా చివరిదశ ప్రయోగాలను దేశంలో భారీస్థాయిలో చేపట్టనున్నారు. ప్రాథమిక దశ తర్వాతి దశ ట్రయల్స్‌ను భారత్‌కు చెందిన ఫార్మా సంస్థలు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భారత్‌ బయోటెక్‌ చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇందుకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) త్వరలోనే అనుమతించనుంది. కొద్దినెలల వ్యవధిలోనే దేశంలో ‘ఇంట్రా నాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌’ అందుబాటులోకి రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆఖరి దశ ప్రయోగాల్లో 30 నుంచి 40 వేల మంది వలెంటీర్లపై ప్రయోగించే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా రష్యాకి చెందిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రయోగాలు భారత్‌లో నిర్వహించేందుకు అనుమతులు అభించినట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.