హైదరాబాద్ వర్షాలు.. టాలీవుడ్ స్టార్స్ సాయం చేయరా ?

భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం వణికిపోతుంది. పలు కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. దీనికితోడు మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. మరో మూడ్నాలుగు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా ఇలాంటి సమయంలో సినీ తారలు ముందుకొస్తారు. తమవంతుగా సాయం చేస్తుంటారు. పక్క రాష్ట్రాల్లో భారీ వర్షాలు-వరదలు వచ్చిన సమయంలోనే మన స్టార్స్ విరాళాలు అందించారు. గొప్ప  మనసు చాటుకున్నారు. అలాంటిది  మన రాష్ట్రంలో, మన హైదరాబాద్ లో వర్షాలు ముంచెత్తితే.. భారీ నష్టం జరిగితే వారు కచ్చితంగా స్పందిస్తారు. సాయం చేస్తారని భావిస్తాం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.

కరోనా లాక్‌డౌన్ తో ఆర్నేళ్లు సినిమా షూటింగ్స్ ల్లేవ్. సినిమా రిలీజ్ ల్లేవ్. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో సినీ తారలు ముందుకొచ్చి సాయం చేసే పరిస్థితి లేదు. అయితే మునుపటిలా కోట్ల రూపాయలు కాకున్నా.. లక్షల్లోనైనా సాయం చేయొచ్చు కదా అంటున్నారు. ఎప్పుడూ లేనిది సీఎం కేసీఆర్ ఈ సారి నోరు తెరచి మరీ అడిగారు. భారీవర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చాటాలని కోరారు. సినీ ప్రముఖులని సీఎం కేసీఆర్ ప్రస్తావించకున్నా.. ప్రముఖుల లిస్టులో వారు ఉంటారు.

మరోవైపు బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణకు సాయం అందింది. తమిళనాడు ప్రభుత్వం పది కోట్ల రూపాయల ఆర్థికసాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సీఏం కేసీఆర్‌కు లేఖ రాశారు. తమిళనాడు రాష్ట్రం తరఫున రూ.10 కోట్లు ఆర్థికసాయంతో పాటు పెద్దసంఖ్యలో దుప్పట్లు, చద్దర్లు పంపుతున్నట్లు ప్రకటించారు. ఇంకా అవసరమైన సాయం చేస్తామని తెలిపారు. తమిళనాడు రాష్ట్రం, ప్రజలు, సీఎం పళనిస్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.