నాయినిని పరామర్శించిన హరీష్
ఉద్యమనేత, మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన్ని మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఎంపీ కొత్తకోట ప్రభాకర్ రెడ్ది, నిరంజన్ రెడ్డితో కలిసి హరీష్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. నాయిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను హరీష్ రావు కోరారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ధైర్యం చెప్పారు.
గత నెల 28న కరోనా బారినపడిన నాయిని.. బంజారాహిల్స్‌లోని ఓ దవాఖానలో 16 రోజులపాటు చికిత్స పొందారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. అయితే ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో అపోలో ఆసుపత్రిలో చేరారు. వివిధ రకాల పరీక్షలు చేసిన డాక్టర్లు నాయిని ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆయనకి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.