చెన్నై ఓటములకి అదే కారణం !
మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా తొలిసారి ఓడిపోయారు. ఇన్నాళ్లు ఆయన ఆటగాడిగా ఓడినా.. కెప్టెన్ గా మాత్రం గెలిచారు. అద్భుతాలు చేశారు. టీమిండియాకు అద్భుత విజయాలని అందించారు. ఐపీఎల్ లో నూ చెన్నైకి మూడు సిరీస్ లు తెచ్చిపెట్టారు. అయితే తాజా సీజన్ లో చెన్నై అట్టర్ ప్లాప్ అయింది.
ఐపీఎల్ 13 టైటిల్ పోరులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ధోనీసేన ఓడింది. దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆడిన పది మ్యాచుల్లో కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున పడిపోయింది. అయితే చెన్నై ఓటములకి గల కారణం.. యువకులకి ఛాన్స్ ఇవ్వకపోవడమే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై రాజస్థాన్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని క్లారిటీ ఇచ్చారు.
“ఈసారి కొన్ని ప్రయోగాలు చేశాం. అవి మీలో అందరికీ నచ్చకపోవచ్చు. కానీ.. మైదానంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. జట్టును పదేపదే మార్చడం వల్ల జట్టులో ఆటగాళ్లకు వాళ్ల స్థానంపై అభద్రతాభావం వస్తుంది. ఆ ఉద్దేశంతోనే జట్టులో ఎక్కువ మార్పులు చేయలేదు. కొంతమంది యువ ఆటగాళ్లకు అవకాశం రాలేదన్నది వాస్తవం.
అయితే.. వాళ్లలో మాకు ఆ మెరుపు కనిపించలేదు. ప్రపంచస్థాయి బౌలర్లను ఎదుర్కోగలరన్న నమ్మకం రాలేదు. వాళ్లపై ధీమా ఉంటే అనుభవజ్ఞులను పక్కనపెట్టి కుర్రాళ్లను జట్టులోకి తీసుకునేవాళ్లం. ఈరోజు ఫలితం వచ్చేసింది. దీని గురించి పట్టించుకోకుండా లీగ్ దశలో మిగిలిన మ్యాచుల్లో కుర్రాళ్లకే అవకాశం ఇస్తాం. ఇకపై వాళ్లపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. స్వేచ్ఛగా ఆడుకోవచ్చు” అన్నారు.