గబ్బర్ మళ్లీ గర్జించాడు.. కానీ !

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో సెంచరీ చేయడం అంటేనే ఎవరెస్ట్ శిఖరం ఎక్కిడంలాంటిది. అలాంటిది ధావన్ వరుసగా రెండు సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని ఈజీగా ఎక్కేశాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు సెంచరీలు బాదేశాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే వరుసగా రెండు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా ధావన్‌ చరిత్ర సృష్టించాడు.

మంగళవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ లో ధావన్ 61 బంతుల్లోనే 12 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో 20 ఓవర్లకు ఢిల్లీ 164 పరుగులు చేసింది. అయితే టార్గెట్ ని ఢిల్లీ జట్టు కాపాడుకోలేకపోయింది. ఢిల్లీ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులుండగానే విజయవంతంగా ఛేదించింది.

నికోలస్‌ పూరన్‌ (53; 28 బంతుల్లో 6×4, 3×6), మాక్స్‌వెల్‌ (32; 24 బంతుల్లో 3×4), క్రిస్‌గేల్‌ (29; 13 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. దీంతో శిఖర్‌ ధావన్‌ (106*; 61 బంతుల్లో 12×4, 3×6) అద్భుత శతకం వృథా అయింది. వాస్తవానికి ధావన్ సెంచరీ చేస్తే ఆ మ్యాచ్ గెలవాల్సిందే. ఇది టీమిండియా సెంటిమెంట్. ధావన్ సెంచరీ చేసిన సందర్భాల్లో టీమిండియా ఎక్కువసార్లు గెలుపొందింది. అయితే ఈ సెంటిమెంట్ ఐపీఎల్ లో రిపీట్ కాలేదు.