నాయిని నర్సింహారెడ్డి ఇకలేరు

తెరాస సీనియర్‌ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుముశారు. శ్వాస సంబంధిత సమస్యతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన నాయిని చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. నాయిని ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని మంత్రులు కేటీఆర్, హరీష్, ఈటెల తదితరులు పరామర్శించిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం సీఎం కేసీఆర్ కూడా అపోలో హాస్పటల్ కి వెళ్లి నాయిని పరామర్శించారు.

పదేళ్ల వయసులో నిజాం పోలీసులు జరిపిన కాల్పుల్లో తండ్రిని కోల్పోయిన నాయిని కుటుంబం స్వస్థలం నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ నుంచి దేవరకొండ గ్రామానికి వెళ్లింది. 4వ తరగతి చదువుతున్నపుడు ప్రొగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ పార్టీ మీటింగ్‌కు ఆయన వెళ్లారు. తర్వాత సోషలిస్టు పార్టీలో చేరారు. రాజకీయాలు, యజమాన్యాలకు అతీతంగా కార్మికుల కోసమే పనిచేయాలనే నిబంధనలతో హింద్‌ మజ్దూర్‌ సభ సిద్ధాంతాలను ఔపోసన పట్టి ఆచరించారు

తెలంగాణ ఉద్యమంలో మొదట్నుంచీ కీలక పాత్ర పోషించిన నాయిని తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పలు ప్రముఖ కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన నాయిని ముషీరాబాద్ శాసనసభ్యుడిగా మూడుసార్లు గెలిచారు. మొదటిసారిగా 1978లో టి.అంజయ్యపై గెలిచారు. 1985, 2004లో ఎమ్మెల్యేగా ఉన్నారు. 

2001లో తెరాసలో చేరిన ఆయన తెలంగాణ ఆవిర్భావం వరకు ప్రతి దశలోనూ కేసీఆర్ వెంట కీలకంగా వ్యవహరించారు. వైఎస్ సర్కారులో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా చేసిన నాయిని.. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ అనంతరం తొలి హోంమంత్రిగా పనిచేశారు. తెలంగాణ హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు బాధ్యతలు నిర్వహించారు.