నాయిని చివరి సభ అదే.. !

తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అనారోగ్యంతో బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయపక్షాలు, ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. నిరంతరం జనం మధ్య ఉండే నాయిని సెప్టెంబరు 27న ఆఖరిసరిగా ముషీరాబాద్‌ పద్మశాలి ప్రజాసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అశోక్‌నగర్‌లో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ కన్నుమూసిన చోట ఏర్పాటుచేసిన విగ్రహావిష్కరణకు హాజరయ్యారు.

కార్మికనేత గుర్తింపు తెచ్చుకున్న నాయిని.. హైదరాబాద్ రాజకీయాలపై ప్రత్యేక ముద్ర వేశారు. రాజకీయాలు, యజమాన్యాలకు అతీతంగా కార్మికుల కోసమే పనిచేయాలనే నిబంధనలతో హింద్‌ మజ్దూర్‌ సభ సిద్ధాంతాలను ఔపోసన పట్టి ఆచరించారు. బేగంబజార్‌ పహిల్వాన్లతో కుస్తీ పట్టేవారు. చార్మినార్‌, బేగంబజార్‌, కోవాబేలా, లాడ్‌బజార్‌లో చిరువ్యాపారులతో యూనియన్‌ ఏర్పాటు చేశారు. ఎమర్జన్సీ సమయంలో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. తొలి దశ, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తొలి హోంమంత్రిగా పనిచేశారు.