డీకే అరుణ అరెస్ట్
తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దుబ్బాక ఉప ఎన్నిక భాజాపా అభ్యర్థి రఘునందన్ పై పోలీసులు దాడి చేయడానికి భాజాపా నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఇందుకు నిరసనగా తెలంగాణ భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో స్వీయ నిర్బంధంలో దీక్ష చేస్తున్నారు. ఆయన్ని పరామర్శించడానికి ఎమ్మెల్సీ రామచందర్‌రావు, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, ఇతర నేతలు వెళ్లాల్సి ఉంది. అయితే వారిని ఇళ్ల వద్దే పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్భంధం చేశారు.
పోలీసుల తీరుపట్ల భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహనిర్బంధం చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఎమ్మెల్సీ రామచందర్‌రావు విమర్శించారు. దుబ్బాకలో భాజపా గెలిచే అవకాశాలు మెండుగా ఉండటంతోనే తెరాస ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిందేనని డీకే అరుణ స్పష్టం చేయగా.. ఇంటి నుంచి బయటకి రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో డీకే అరుణ నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.