సూర్య కుమార్’ని టీమిండియా ఎందుకు ఎంపిక చేయలేదు ?

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ అదరగొడుతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్ లో ముంబైని ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. గత మూడు ఐపీఎల్ సీజన్స్ నుంచి సూర్యకుమార్ యాదవ్ నిలకడగా రాణిస్తున్నారు. అయినా.. అతడిని టీమిండియాలోకి ఎంపిక చేయడం లేదు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన మూడు ఫార్మాట్లలోనూ సూర్యకుమార్‌ పేరును ప్రస్తావించలేదు.

ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ పొలార్డ్ మాట్లాడుతూ.. సూర్య కుమార్ యాదవ్ ని టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

“మధ్యలో మేం కొన్ని వికెట్లు కోల్పోయినా సూర్య మమ్మల్ని విజయతీరాలకు చేర్చాడు. ఒక కుర్రాడు మూడోస్థానంలో వచ్చి అలాంటి స్ట్రైక్‌రేట్‌తో ఆడడం ఎలా ఉంటుందో ఊహించండి. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఒంటిపోరాటం చేశాడు. అతడు నిలకడగా ఆడటమే మాకు చేసే అత్యంత మేలు. ఒక ఆటగాడిగా ఇలా నిలకడగా ఆడుతుంటే రివార్డులు వాటంతట అవే వస్తాయి. సూర్య గురించి మాట్లాడాలంటే టీమ్‌ఇండియాకు ఎంపిక చేయకపోవడం పట్ల ఎంతో నిరాశ చెంది ఉంటాడు” అని పొలార్డ్‌ చెప్పుకొచ్చారు.