తెలంగాణ భాజాపా.. 11 ఝూటా మాటలు !

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో తెరాస-భాజాపాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర నిధులపై మంత్రి హరీష్ రావు తెలంగాణ భాజాపాకు ఒకటికి రెండు సార్లు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే సవాల్ స్వీకరించని భాజాపా నేతలు.. హరీష్ మాటలన్నీ అబద్దాలేనని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి హరీష్ మరోసారి భాజాపాపై విరుచుకుపడ్డారు.

సిద్దిపేటలో మీడియాతో  మాట్లాడిన మంత్రి హరీష్ రావు.. బీజేపీ ఎంపీలు గెలిచిన చోట అభివృద్ధి శూన్యమని తెలిపారు. బాండ్ పేపర్ మీద వాగ్దానాన్నిరాసిచ్చిన ఎంపీ.. ఇప్పటికీ పసుపు బోర్డు తేలేదు. పసుపు రైతుల బాధ తీర్చలేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భాజాపా చెప్పిన మొత్తం 11 ఝూటా మాటలని బయటపెట్టారు. వాటి గురించి వివరించారు.

ఝూటా నంబర్ 1:

టీఆర్ఎస్ ప్రభుత్వం, బీడీ కార్మిక మహిళలకు ఇస్తున్న పెన్షన్ 2016 రూపాయలలో, 1600 రూపాయలు మోడీ గారు ఇస్తున్నారు అని అన్నారు. బీడీల అమ్మకాలపై బీజేపీ ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించడం వల్ల బీడీల అమ్మకాలు మరింత పడిపోయాయి.

ఝూటా నంబర్ 2 :

కేసీఆర్ కిట్ పథకం కింద ఇచ్చే డబ్బు 13 వేలలో.. 6 వేల రూపాయలు కేంద్రం ఇస్తుందని ఒకరు, 8 వేలు ఇస్తుంది అని ఇంకొకరు అబద్ధాలు చెప్తున్నారు. ఇది అబద్ధం.కేసీఆర్ కిట్‌ను 100 శాతం టీఆర్ఎస్ ప్రభుత్వమే ఇస్తుంది.

ఝూటా నంబర్ 3 :

గొర్రెల యూనిట్లలో రూ. 50 వేలు బీజేపీ ఇస్తుంటే కేవలం రూ. 25 వేలే టీఆర్ఎస్ ఇస్తున్నదట. ఈ పథకం ఖర్చు నూటికి నూరుశాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది

ఝూటా నంబర్ 4 :

కేంద్రం రూ. 25 కోట్లతో ఈఎస్ఐ హాస్పిటల్ చేగుంటకు మంజూరు చేస్తే టీఆర్ఎస్ దాన్ని గజ్వేల్‌లో పెట్టుకున్నదని అంటున్నారు. గజ్వేల్‌లో ఈఎస్ఐ ఆస్పత్రి లేదు. చేగుంటకు ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరు కాలేదు.. ఒక వేళ మంజూరు అయితే ఆధారం చూపించండి.

ఝూటా నంబర్ 5 :

రేషన్ బియ్యం సబ్సిడీలో కిలోకు 29 రూపాయలు కేంద్రం భరిస్తుంటే కేవలం 1 రూపాయి మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం భరిస్తున్నదట. కేంద్రం ఇచ్చేది సగం కార్డులకే. మిగతా సగం కార్డుల సబ్సిడీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది.

ఝూటా నంబర్ 6 :

పాలిటెక్నిక్ కాలేజ్ కు దుబ్బాకలో శంకుస్థాపన జరిగాక సిద్దిపేటకు తరలించారు అని అంటున్నారు. మంజూరు కాలేదు. శంకుస్థాపన అంతకంటే కాలేదు, సిద్దిపేటకు తీస్కపోలేదు.

ఝూటా నంబర్ 7 :

కేసీఆరే మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నాడు. విద్యుత్తు సంస్కరణల బిల్లు తెచ్చింది వాళ్ళు.. రూ. 2,500 కోట్లు ఎర వేసింది వాళ్ళు.

ఝూటా నంబర్ 8 :

తెలంగాణా రైతులు పండించిన వరి ధాన్యం కనీస మద్దతు ధరకు కొనేందుకు కేంద్రం రూ. 5,500 కోట్లు విడుదల చేసింది అని అంటున్నారు. ది పచ్చి బూటకం. కేంద్రం ఒక్క రూపాయి విడుదల చేయలేదు.

ఝూటా నంబర్ 9 :

డబ్బులు దొరికిన ఇల్లు మావాళ్ళది కాదు అంటున్నారు. మీవాళ్ళది కానప్పుడు నువ్వెందుకు ఉలిక్కిపడ్డవు ? దుబ్బాక లో ప్రచారం ఆపేసి 20 నిముషాల్లో సిద్ధిపేట చేరుకొని ఆ ఇంటిముందు హడావిడి ఎందుకు చేశావు.

ఝూటా నంబర్ 10 :

మాకు సంబంధించిన ఎనిమిది మంది ఇండ్ల మీద పోలీసులు దాడులు చేసి సోదాలు చేసారు అని అంటున్నారు. ఒకే సంఘటనపై మూడు అబద్ధాలు. నాలుగు ఇండ్లలోనే సోదాలు.. రెండు టీఆర్ఎస్ వాళ్లవి.. రెండు బీజేపీ వాళ్లవి.

ఝూటా నంబర్ 11 :

సోదాలో దొరికిన డబ్బులు పోలీసులే పెట్టారు అంటున్నారు. అడ్డంగా దొరికి పోయి, పైనుంచి అబద్ధం.. డబ్బులు తమవేనని స్వయంగా రఘునందన్ అత్తామామలు చెప్పిన వీడియోనే రుజువు.