భీమ్‌ ఫర్‌ రామరాజు.. కొత్త రికార్డ్ !

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమా కోసం మొదటిసారి రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి పనిచేస్తున్నారు. ఇందులో చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు.

రామ్‌చరణ్‌ పుట్టినరోజు కానుకగా మార్చి 27న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ఆయన పాత్రను పరిచయం చేస్తూ.. ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ అనే పేరుతో ఓ స్పెషల్‌ టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో అల్లూరి సీతారామరాజుగా చరణ్ యాక్షన్ ని చూసి అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పటివరకూ అత్యధిక మంది వీక్షించిన టీజర్‌గా ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ రికార్డు సొంతం చేసుకుంది. ఈ టీజర్‌ను 33.3 మిలియన్ల మంది అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో వీక్షించారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్  సరసన బాలీవుడ్‌ నటి ఆలియా, తారక్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. దాదాపు రూ.400 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల విడుదల చేసిన ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ సైతం ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.