99 వద్ద ఔటైన గేల్’కు జరిమానా.. ఎందుకంటే ?‌

శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పై రాజస్థాన్ ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నాలుగు వికెట్లకు 185 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్‌ 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడినా.. గేల్ (99) అద్భతమైన ఇన్నింగ్స్ మాత్రం ప్రేక్షకులు మరిచిపోరు. అయితే అవుటైన తర్వాత బ్యాటు విసిరేసినందుకు గేత్ లు మ్యాచ్‌ ఫీజులో 10% కోత విధిస్తున్నట్టు మ్యాచ్‌ రిఫరీ ప్రకటించారు.

ఈ మ్యాచులో జోఫ్రా ఆర్చర్‌ వేసిన 19.3వ బంతిని గేల్‌ భారీ సిక్సర్‌గా మలిచి 99 పరుగులకు చేరుకున్నాడు. అంతలోనే పుంజుకున్న ఆర్చర్‌ తర్వాతి బంతికే గేల్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఒక పరుగు తేడాతో శతకం చేజారడంతో గేల్‌ ఆవేశంతో తన బ్యాటును విసిరికొట్టాడు. పెవిలియన్‌ వైపు నడుచుకుంటూ వస్తూ ఆర్చర్‌ను అభినందించాడు. అతడితో చేయికలిపాడు.బ్యాటును అలా విసిరేయడం లీగ్‌ నిబంధనలకు వ్యతిరేకం కావడంతో నిర్వాహకులు జరిమానా విధించారు.