మూడ్నెళ్ల ముందే గ్రేటర్ ఎన్నికలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు గడువు లోగా జరిగిన దాఖలాల్లేవ్. అయితే ఈ సారి మాత్రం మూడ్నెళ్ల ముందే గ్రేటర్ ఎన్నికలు జరగేలా ఉన్నాయ్.ప్రస్తుతం గ్రేటర్ మునిసిపాలిటీ పాలక వర్గం కాలపరిమితి 2021 ఫిబ్రవరి 10వ తేదీ వరకు వుంది. అయితే నవంబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా గ్రేటర్ ఎన్నికలు రావొచ్చని మంత్రి కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజం కాబోతున్నట్టు తెలుస్తోంది.
తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రేటర్ ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనకు షెడ్యూలు ప్రకటించింది. దాని ప్రకారం నవంబర్ ఏడవ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా (డ్రాఫ్టు)ను వెలువరిస్తారు. దానిపై చర్చించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజకీయ పక్షాలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహిస్తుంది. నవంబర్ 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఓటర్ల జాబితా ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. నవంబర్ 13వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు.
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో వున్న వార్డులు, రిజర్వేషన్లను కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 13 తర్వాత గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.