అర్నాబ్ అరెస్టును ఖండించిన భాజపా
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి అరెస్టయిన సంగతి తెలిసిందే. ఓ ఇంటీరియర్ డిజైనర్ ఎండీ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న కేసులో ముంబయి పోలీసులు అర్ణబ్ గోస్వామిని అరెస్టు చేశారు. తనకు చెల్లించాల్సిన రూ.5.40 కోట్లు ఇవ్వకుండా అర్ణబ్తోపాటు మరో ఇద్దరు తనను మోసం చేశారని ఇంటీరియర్ డిజైనర్ సూసైడ్ నోట్లో పేర్కొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో వెల్లడించాడు. 2018లో జరిగిన ఈ ఘటన కేసులోనే అర్ణబ్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆర్నాబ్ అరెస్ట్ పై భాజాపా నేతలు మండిపడుతున్నారు. దీనిపై బుధవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు ప్రకాశ్ జావడేకర్, స్మృతి ఇరానీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ..మహారాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించారు.
మరోవైపు అర్ణబ్ గోస్వామిని పోలీసులు చట్టప్రకారమే అరెస్టు చేశారని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. తప్పుచేసినట్లు ఆధారాలుంటే ఎవరినైనా అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉందన్నారు. ఠాక్రే ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి ఉద్దేశపూర్వకంగా ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తారని పేర్కొన్నారు.