అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోడీకి నిరాశ !
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత్ కు నిరాశ తప్పలేదు. ఎందుకంటే ? భారత ప్రభుత్వం సపోర్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఓటమి అంచున ఉన్నారు. ఆయన ప్రత్యర్థి జో బైడన్ గెలుపు దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం 264 ఎలక్టోరల్ ఓట్లను బైడెన్ సొంతం చేసుకున్నారు. మరో 6 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే ఆయన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకుంటారు. ట్రంప్ అధ్యక్ష పదవి రేస్ నుంచి దాదాపుగా తప్పుకున్నారు. 214 ఓట్ల వద్దే ఆగిపోయారు. కొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ మిగిలి ఉంది.
భారత్ లో కరోనా విజృంభణకు ముందు మోడీ ప్రభుత్వం ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కోట్లు ఖర్చుపెట్టింది. ప్రతీ భారతీయుడు ట్రంప్ జపం చేసేలా ప్లాన్ చేసింది. తద్వారా ప్రతి ప్రవాస భారతీయుడు ఓటు ట్రంప్ కు పడేలా స్కెచ్ వేశారు. ట్రంప్ వస్తున్న నేపథ్యంలో ఆయనకి మన మురికివాడలు కనిపించకుండా గోడలు కూడా కట్టారు. అయితే ఆ తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పలుమార్లు భారత్ పై ట్రంప్ నోరు జారారు. భారత్ మురికిదేశమని ఆరోపించారు. మనదేశం కరోనా విషయంలో తప్పుడు లెక్కలు చూపిస్తోందని దుయ్యబట్టారు. ఏదేమైనా మోడీ ప్రభుత్వం సపోర్ట్ చేసిన ట్రంప్ ఓడిపోతున్నారు. ఆ బాధలో ప్రస్తుతం మన ప్రధాని ఉండి ఉండవచ్చు.
వాస్తవానికి మరోసారి అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ గెలుస్తారని అనుకున్నారు. మనదేశం అదే భావించింది. ఎన్నికలవేళ ఆయన్ని మరింత మచ్చిక చేసుకొనే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే నమస్తే ట్రంప్ నిర్వహించారు. అయితే ఆతర్వాత సీన్ మారింది. అమెరికాలో కరోనా కట్టడి విషయంలో ట్రంప్ అలసత్వం వహించారని ఆ దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అదే ఈ ఎన్నికల్లో ఆయన ఓటమికి ప్రాధాన కారమని చెబుతున్నారు. అయితే కొత్త అధ్యక్షుడు జో బైడన్ కూడా భారత్ తో తత్సబంధాలని కొనసాగిస్తారని ఆశిస్తున్నారు.