కోహ్లీ ఉన్నన్ని రోజులు బెంగళూరు కప్ గెలవదు
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బలమైన జట్టు. కానీ ఇప్పటి వరకు కప్ గెలవలేదు. ఈ సారి ప్లేఆఫ్ కు చేరిన కోహ్లీ సేన కచ్చితంగా కప్ గెలుస్తుందని బెంగళూరు అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ వాటిని కోహ్లీ సేన ఫైనల్ వరకు కూడా తీసుకెళ్లలేకపోయింది. శుక్రవారం హైదరాబాద్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరు ఓడింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 131/7 పరుగులు చేసింది. డివిలియర్స్(56) అర్ధశతకంతో మెరవడంతో ఆ మాత్రమైనా స్కోర్ సాధించింది. లేదంటే పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది. ఇక ఛేదనలో హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేన్ విలియమ్సన్(50*), జేసన్ హోల్డర్(24*) ఒత్తిడిలో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో వార్నర్‌సేన రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. బెంగళూరు ఇంటిముఖం పట్టింది.
దీంతో ఆ జట్టు ఓటమిపై అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. కోహ్లీ ఉన్నన్ని రోజులు బెంగళూరు ఈ లీగ్‌లో విజేతగా నిలవలేదని, అతడు టీమ్‌ఇండియాకు కూడా పెద్ద కప్పులు సాధించలేడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విజయాలు సాధిస్తే.. జేజేలు పలుకుతారు అభిమానులు. అదే అపజయం పాలైతే.. ఇలా బదనాం చేస్తారు. గెలుపు, ఓటమిలు ఆటలో భాగమని గ్రహిస్తే మంచిదేమో. కానీ.. గత 13 సీజన్ లోనూ ఒక్కసారి కప్ గెలవకపోవడమే అభిమానుల నిరాశ కారణమేమో.. ! అభిమానుల బాధనిఅర్థం చేసుకొని వచ్చే ఐపీఎల్ లోనైనా బెంగళూరు కప్ కొట్టాలని ఆశిద్దాం.