దుబ్బాక ఓటమి బాధ్యత నాదే : హరీష్ రావు

గెలుపు వచ్చినప్పుడు కాదు. ఓటమి వచ్చినా బాధ్యత వహించిన వాడే అసలైన నాయుడు. ఇప్పుడు మంత్రి హరీష్ రావు నిజమైన నాయకుడు అనిపించుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస ఓటమిపాలైన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. ఈ ఓటమితో తెరాస శ్రేణుల్లో నిరాశ ఏర్పడింది.

ఇక ఎన్నికలో అన్నీ తానై వ్యవహరించారు మంత్రి హరీష్ రావు. దుబ్బాకలో తెరాస గెలుపు బాధ్యతని ఆయన తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే కష్టపడ్డారు. కానీ ఫలితం ఆశించినట్టు రాలేదు. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయంపై తెరాస కీలకనేత, మంత్రి హరీశ్‌రావు స్పందించారు.

తెరాసకు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని, దుబ్బాక ప్రజా సేవలో నిరంతరం పాటుపడతామన్నారు. ఓడిపోయినప్పటికీ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామన్నారు. సీఎం నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు.