తెలంగాణలో బాణసంచా నిషేధంపై సడలింపులు

బాణసంచాను నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. గాలి నాణ్యత సూచీల ఆధారంగా టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉన్నచోట టపాసులపై నిషేధం విధించింది. గాలి నాణ్యత సాధారణంగా ఉన్నచోట రాత్రి 8గంటల నుంచి 10 గంటల వరకు గ్రీన్‌ క్రాకర్స్‌కు అనుమతించింది.

ఈనెల 9న జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ఆదేశాలను సవరిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంతకే ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ? దేశవ్యాప్తంగా గాలి నాణ్యత ఆధారంగా టపాసుల కాల్చివేత, విక్రయాలకు అనుమతివ్వాలని ఎన్జీటీ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాణసంచా అమ్మకాలు, కాల్చడంపై పూర్తిగా నిషేధం విధించింది. గాలి నాణ్యత సాధారణ స్థితిలో ఉంటే అలాంటి ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టపాసులు కాల్చుకునేందుకు ఎన్జీటీ అనుమతించింది.