యోయో పరీక్షలో రోహిత్ పాసైతేనే.. !
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియాకు కీలక ఆటగాడిగా మారాడు. వన్డేల్లో టీమ్ఇండియాకు ఓపెనర్‌గా మారినప్పటి నుంచి అతడి ఆటే మారిపోయింది. టీ20, వన్డేల్లో రోహిత్ ఎక్కువ సేపు క్రీజులో ఉంటే మ్యాచ్ టీమ్ఇండియాదే అన్న అభిప్రాయం బలపడింది. అయితే ఐపీఎల్లో తొడ కండరాల గాయం నేపథ్యంలో రోహిత్ ని మొదట ఆస్ట్రేలియా పర్యటనకి ఎంపిక చేయలేదు. ఆ తర్వాత రోహిత్ వేగంగా కోలుకోవడంతో.. టెస్ట్ సిరీస్ కి మాత్రమే ఎంపిక చేశారు.
టెస్టులకు సిద్ధమయ్యేందుకు రోహిత్‌కు 15 రోజుల గడువు కూడా ఇచ్చింది! ఐపీఎల్ ముగియగానే జట్టంతా ఆస్ట్రేలియాకు పయనమవగా.. రోహిత్ నేరుగా ఎన్సీఏకు చేరుకున్నాడు! డిసెంబరు 17న అడిలైడ్‌లో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. నిబంధనల ప్రకారం ఆసీస్‌లో అడుగుపెట్టిన వాళ్లకి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి. తొలి టెస్టు ఆడాలంటే కనీసం 2, 3 రోజుల ముందు నుంచి జట్టుకు అందుబాటులో ఉండాలి. అంటే ఈనెలాఖరు లోపు అక్కడికి చేరుకోవాలి. ఎన్సీఏలో మ్యాచ్ ఫిట్నెస్ సాధించిన తర్వాత యోయో పరీక్షలో రోహిత్ పాసైతేనే ఇవన్నీ జరుగుతాయి.