గ్రేటర్ ఫైట్ : కేటీఆర్ తొలి పంచ్ అదిరింది

గ్రేటర్ ఎన్నికలని షార్ట్ అండ్ స్వీట్ గా ప్లాన్ చేసింది ఎన్నికల సంఘం. కేవలం పక్షం రోజుల్లోనే గ్రేటర్ ఎన్నికల సందడి ముగిసేలా ప్లాన్ చేసింది. డిసెంబర్ 1న పోలింగ్, 4న ఫలితాలు రానున్నాయ్. ఇక నిన్నటితో నామినేషన్ల పర్వం ముగియడంతో.. నేటి నుంచి ప్రచారం ఊపందుకుంది. మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగిపోయారు. నగరంలోని కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్‌, మూసాపేట్‌ డివిజన్ల టీఆర్‌ఎస్‌ కార్పొరేట్‌ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా భాజాపాపై పంచులేశాడు. భాజాపా నేతల నుంచి ఇటీవల వచ్చిన మాటలకి రోడ్ షోలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వరద సాయంగా రూ. 10వేలు ఇస్తుంటే అడ్డుకున్న భాజాపా.. రూ. 25వేలు ఇస్తానని చెబుతోంది. అసలు భాజాపాను రూ. 25వేలు ఇవ్వకుండా అడ్డుకున్నది ఎవరు ? ఇప్పుడు కూడా  ఇవ్వొచ్చు కదా ?? అని ప్రశ్నించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వలన పైసా లాభం లేదన్నారు. హైదరాబాద్ లో చాలా దేవాలయాలు ఉన్నాయి. కానీ బండి సంజయ్ ఛార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మీ దేవాలయం మాత్రం కావాలి. ఎందుకంటే.. ? హిందూ-ముస్లిం అంటూ.. గొడవలు లేపాలని, వీరికి ఇండియా-పాకిస్థాన్, హిందూ-ముస్లిం తప్ప మరోటి తెలియదు. ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు.. హుషారు హైదరాబాద్ అని పంచులేశారు కేటీఆర్. మొత్తంగా తొలి రోడ్ షోలోనే కేటీఆర్ అదిరిపోయే పంచులేశారు.