కల్యాణలక్ష్మీలో రూ. 2 కోట్ల స్కామ్

కల్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ – తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాలివి. ఏ ఆడ పిల్ల కుటుంబానికి భారం కాకూడదనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఈ పథకాలని శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఆడపడుచులకి ప్రభుత్వం పెళ్లి కానుకగా ఈ పథకాలని పేర్కొన్నారు. అయితే ఇప్పుడీ పథకాల్లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

ఆదిలాబాద్ లో కల్యాణ లక్షీ పథకంలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 2కోట్ల నగదు అక్రమార్కులు కాజేసినట్టు గుర్తించారు. జిల్లాలోని ఇచ్చోడ, గుడిహత్నూర్, సిరికొండ మండలాల్లో  కల్యాణ లక్ష్మీ పథకాల్లో అక్రమాలు జరిగాయ్. 3700 మందిలబ్ది దారులకి కల్యాణ లక్ష్మీ మంజూరు కాగా.. ఇందులో 637 అక్రమార్కులు, అనర్హులకు  అందినట్టు గుర్తించారు.

మీసేవ కేంద్రాలతో కొందరు అధికారులు కుమ్మకై ఈ స్కామ్ కి తెరలేపినట్టు తెలిసింది. ఈ స్కామ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. ఇచ్చోడ, గుడిహత్నూర్, సిరికొండ, బోధ్ మండల్లాల్లో పలువురి ఖాతాల్లో రెండు, మూడు సార్లు కల్యాణ లక్ష్మీ డబ్బులు జమ అయినట్టు గుర్తించారు. ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. ఎవరిని వదిలిపెట్టమని పోలీసులు చెబుతున్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు.. తెలంగాణలోని అన్నీ జిల్లాల్లోనూ కల్యాణ లక్ష్మీ స్కామ్  జరుగుతోందని చెబుతున్నారు.