భాజాపా ఎంపీ అరవింద్’పై క్రిమినల్ కేసు
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా తెరాస-భాజాపా నేతలు ఘూటైన విమర్శలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ భాజాపా ఎంపీ ధర్మపురి అరవింద్ మాటలతో సరిపెట్టకుండా చేతులకి పని చెప్పమని కార్యకర్తలకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలు ఎక్కడ కనిపించినా.. చించేయమని కార్యకర్తలకి పిలునిచ్చారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పార్క్ వద్ద కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలని కార్యకర్తలు చించేశారు.
ఈ ఘటనపై టీఆర్ఎస్ లీగల్ సెల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగా ఫ్లెక్సీలను చించడంతోపాటు నగరంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పాలన్న దురుద్దేశంతో ఈ పని చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపైబంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనపై ఐపీసీ 504, 506, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.