సామాన్యులపై మరో పిడుగు.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు !

కరోనా నేపథ్యంలో గత ఐదు నెలలుగా స్థిరంగా ఉన్న వంటగ్యాస్‌ ధరలు.. మళ్లీ ఇప్పుడే పెరిగాయి. వినియోగదారులకు రాయితీగా అందించే ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ. 594గా ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర రూ. 644కు పెరిగింది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఆ మేరకు గ్యాస్‌ ధర మోత మోగనుంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు చమురు సంస్థలు తెలిపాయి.

గృహ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌పై రాయితీ కల్పిస్తోన్న విషయం తెలిసిందే. వినియోగదారులు సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు రాయితీతో కొనుగోలు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కావాలంటే మార్కెట్‌ ధరలకు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది.