మసాలా మహాశయ్ ఇకలేరు
మసాలా సామ్రాజ్యాధినేత, పద్మభూషణ్ గ్రహీత మహాశయ్ ధర్మపాల్ గులాటీ (98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గులాటీ గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఢిల్లీ రోడ్లపై గుర్రపు బండి నడిపిన ఆయన.. మసాలా సంస్థను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు. తొలుత చిన్న బడ్డీకొట్టుతో మొదలైన ఆయన వ్యాపారం అనతి కాలంలోనే దిగ్గజ పరిశ్రమ స్థాయికి చేరుకుంది.
దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఏడాదికి 900 కోట్ల రూపాయల టర్నోవర్తో విదేశాల్లోనూ ఆఫీసులు నిర్వహించే స్థాయికి చేరింది. అమెరికా, కెనడా, ఇంగ్లడ్, జపాన్, యూఏఈ, సౌదీఅరేబియా లాంటి ఎన్నో దేశాలకు ఎండీహెచ్ మసాలా ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం ఎండీహెచ్ 62 రకాల మసాలాలను ఉత్పత్తి చేస్తోంది. గులాటీ తన జీతంలో 90శాతానికి పైగా సామాజిక సేవా కార్యక్రమాలకే ఇచ్చేవారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. గులాటీ మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.