టీమిండియా ఆల్‌రౌండర్లపై గంగూలీ ప్రశంసలు

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీసేన 13 పరుగులతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో పాండ్య (92; 76 బంతుల్లో 7×4, 1×6), జడేజా (66; 50 బంతుల్లో 5×4, 3×6) అర్ధశతకాలతో రాణించడమే కాకుండా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 152/5తో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నారు. చివరి వరకూ క్రీజులో ఉండి 150 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో ఆస్ట్రేలియా ముందు 303 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.

అనంతరం కంగారూలు 289 పరుగులకు ఆలౌటై ఓటమిపాలయ్యారు. అయితే సిరీస్ మాత్రం 2-1తో ఆసీస్ కైవసం చేసుకుంది. అయినా టీమిండియాలో నిరాశలేదు. సిరీస్‌ కోల్పోయినా టీమ్‌ఇండియాకు మంచి జరిగిందని బీసీసీఐ బాస్ గంగూలీ అన్నారు. టీమిండియా ఆల్‌రౌండర్లపై ప్రశంసలు కురిపించారు. ‘సిరీస్‌ ఓడిపోయినా టీమ్‌ఇండియాకు మంచి విజయం దక్కింది. ఇది సుదీర్ఘ పర్యటన అయినందున ఈ విజయంతోనైనా పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నా. జడేజా, పాండ్య దీర్ఘ కాలంలో భారత జట్టుకు విలువైన ఆటగాళ్లుగా మారతారు’ అని దాదా ట్వీట్‌ చేశాడు.