ఏపీలో 630 కేసులు, అంబటి రెండోసారి కరోనా !

ఏపీలో గడిచిన 24 గంటల్లో 630 కొత్త కేసులు నమోదయ్యాయ్. నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,71,305కు చేరింది. గడిచిన 24 గంటల్లో 882 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకొని 8,58,115 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 7,024 మంది కొవిడ్‌తో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,166 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

మరోవైపు వైకాపా నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మరోసారి కరోనా సోకింది. ఇప్పటికే ఓసారి కొవిడ్‌ బారిన పడిన తనకు మరోసారి ఈ వైరస్‌ సోకినట్టు ఆయన ట్విటర్‌లో ప్రకటించారు. రీఇన్ఫెక్షన్‌కు గురికావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ”జులైలో నాకు కొవిడ్‌ వచ్చి తగ్గిన సంగతి మీ అందరికీ విదితమే. నిన్న అసెంబ్లీలో కొవిడ్ టెస్ట్‌ చేయించాను. పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. రీ ఇన్ఫెక్షన్‌కు గురికావడం ఆశ్చర్యం కలిగించింది. అవసరమైతే ఆస్పత్రిలో చేరతాను. మీ ఆశీస్సులతో మరోసారి కరోనాను జయించి మీ ముందుకు వస్తా” అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.