గ్రేటర్ ఫలితాలపై ఏపీ రియాక్షన్

ఏపీలో ఏం జరుగుతోందని తెలంగాణ ప్రజలు. తెలంగాణలో ఏం జరుగుతుందని ఏపీ ప్రజలు ఆరా తీయడం సాధారణమే. అలాంటిది గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు. ప్రజల సంగతి పక్కనపెడితే.. అక్కడి పార్టీలు ఏం అనుకుంటున్నాయి. ఇప్పటికే గ్రేటర్ ఫలితాలపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు. ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థమైంది. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు బలమైన సంకేతం పంపేలా చేసినట్లయింది’ అన్నారు.

ఇక గ్రేటర్ ఫలితాలపై ఏపీ తెదేపా స్పందించలేదు. స్పందించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ? గ్రేటర్ లో బరిలో నిలిచిన తెలంగాణ టీడీపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. అందుకే అన్నీ మూసుకొని ఆ పార్టీ కూర్చుందని చెప్పుకుంటున్నారు. ఇక గ్రేటర్ ఫలితాలని ఓ యాంగిల్ లో వైసీపీ ఎంజాయ్ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన స్వల్ప గ్యాప్ వలన కాదు. కానీ గ్రేటర్ ఎన్నికల్లో తెదేపా ఖాతా తెరవకపోవడం ఆ పార్టీని సంతోషపెట్టింది.

గ్రేటర్ ఎన్నికల్లో 106 డివిజన్లలో పోటీచేసిన టీడీపీ కనీసం ఒక్క చోట కూడా గెలవలేకపోయిందని, అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కలేదని.. ఇలాంటి ఫలితాలు వచ్చిన పార్టీని జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. చంద్రబాబు టీడీపీని ఒక గాలి పార్టీగా తయారుచేశారని విమర్శించారు.