తెరాస నేతలకు ధైర్యం కావాలట.. కేసీఆర్ మీడియా ముందుకు రావాల్సిందే మరీ.. !!
గ్రేటర్ లో గులాభి పార్టీ గెలిచింది. కానీ ఓడింది. గ్రేటర్ ఫలితాల్లో తెరాసకు 55 స్థానాలొచ్చాయ్. ఫైనల్ గా మేయర్ పీఠాన్ని ఆ పార్టీనే సొంతం చేసుకోనుంది. కానీ ఆ ఆనందం గులాభి నేతల్లో కనిపించడం లేదు. కారణం గ్రేటర్ లో భాజాపా అనూహ్యంగా పుంజుకోవడమే. గత గ్రేటర్ ఎన్నికల్లో 4 స్థానాలకు మాత్రమే పరిమితమైన కమలం పార్టీ ఈ సారి ఏకంగా 48 స్థానాలని గెలుచుకొంది. తెరాసకు ప్రత్యామ్నాయం మాదే. 2023లో అధికారంలోకి వస్తామని భాజాపా నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో గులాభి నేతల్లో గుబులు మొదలైంది. ఇప్పుడు వారికి ధైర్యం కావాలి. అంటే.. సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రావాలి. అరె.. భాజాపా బలపడింది లేదు. బొందా లేదు. అంతా ఉత్తది. 2023 వరకు గిదేమీ ఉండదని జెప్పాలె. కానీ గ్రేటర్ ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ స్పందించలేదు. కరోనా టైమ్ లో సీఎం కేసీఆర్ మీడియా ముందుకొస్తే కొండంత ధైర్యం వచ్చేది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి లాంటోళ్లు అన్నారు. మరీ.. ఇప్పుడు కూడా తెరాస శ్రేణుల కోసం మీడియా ముందుకు రండి. వారికి ధైర్యం చెప్పండని.. మెగాస్టార్ లాంటోళ్లు చెప్పాలేమో !
ఇక గ్రేటర్ స్ట్రోక్ నుంచి బయటపడేందుకు సీఎం కేసీఆర్ పని మీద పడబోతున్నారు. ఈ నెల 7న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో వ్యవసాయ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ యేడాది రెండో విడత రైతు బంధు సహాయం కోసం నిధుల విడుదల, పంపిణీపై చర్చించనున్నారు. గ్రేటర్ ప్రజలు ఛీ కొట్టిన .. మాకు రైతులు ఉన్నారనే సంకేతం ఇద్దామని బహుశా.. సీఎం ఈ మీటింగ్ పెట్టుకున్నారేమోనని అనుకుంటున్నరు.