మూడో టీ20 : ఆరంభం అదిరింది.. కానీ !

భారత్-ఆసీస్ మధ్య మూడో టీ20 ప్రారంభం అయింది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. యువ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుత బంతితో విధ్వంసక బ్యాట్స్‌మన్‌ అరోన్‌ ఫించ్‌(0)ను పెవిలియన్‌ పంపాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అనూహ్యంగా ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో సుందర్‌ను బౌలింగ్‌కు దింపాడు. నాలుగో బంతిని ఆఫ్ స్టంప్‌కు ఆవల విసరడంతో షాట్‌ ఆడిన ఫించ్‌ సర్కిల్‌లో హార్దిక్‌ పాండ్య చేతికి చిక్కాడు. దీంతో 14 పరుగులకే ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 

త్వరగా వికెట్ కోల్పోయిన ఆసీస్ దూకుడుగానే ఆటని కొనసాగిస్తోంది. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 69 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. ప్రస్తుతం వేడ్ 46, స్మిత్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ కూడా గెలిచి టీ20 సిరీస్ లో ఆసీస్ కు గుండు కోట్టాలనే కసితో కోహ్లీసేన ఆడుతుంది. మరోవైపు ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని ఆసీస్ ఆశపడుతోంది.