హైదరాబాద్ కోసం తిరుపతిని తాకట్టుపెట్టారా ?

హైదరాబాద్ కోసం తిరుపతిని తాకట్టుపెట్టడం ఏంటీ ? అనుకుంటున్నారు. కాస్త లోతుగా రాజకీయ విశ్లేషణకు వెఌతే అది నిజమే అనిపిస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో భాజాపాకు జనసేన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. నామినేషన్ వేసిన జనసేన అభ్యర్థులు అధినేత పవన్ పిలుపుతో విత్ డ్రా చేసుకున్నారు. భాజాపా గెలుపుకు కృషి చేశారు. అది మంచి ఫలితానిచ్చింది. తెలంగాణలో భాజాపాకు బలం తీసుకొచ్చింది. తెరాసకు ప్రత్యామ్నాయంగా మారింది.

జనసేన చేసిన గ్రేటర్ సాయాన్ని భాజాపా తిరుపతిలో తీర్చుకోనుంది. తిరుపతి ఉప ఎన్నిక స్థానం జనసేనకి కేటాయించనుంది. స్వయంగా జనసేనాని పవన్ కల్యాణ్ బరిలో దిగనున్నారనే ప్రచారం జరిగింది. అయితే అదంతా ప్రచారమే అన్నట్టుగా ఏపీ భాజాపా అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల తిరుపతిలో దిగిపోయారు. తిరుపతిలో పోటీ చేసేది తామేనని ప్రకటించుకున్నారు.

అయితే.. అదే సమయంలో.. జనసేన పార్టీ తాము కూడా పోటీ చేస్తామని.. రంగంలోకి రావడంతో సీన్ మారిపోయింది. బీజేపీ నేతల దూకుడు తగ్గింది. రెండు పార్టీల నేతలతో కమిటీ వేసి.. నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.కమిటీని నియమించారా.. ?ఆ కమిటీలో ఎవరున్నారు..? అన్నదానిపై స్పష్టత లేదు. అయితే తిరుపతి ఉప ఎన్నికపై సోము వీర్రాజు, ఆ పార్టీ నేతలు సలైంట్ అయిపోయారు. బహుశా.. జనసేన అభ్యర్థికి తిరుపతి టికెట్ ఖరారై ఉంటుంది. లేదంటే అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారేమో.. !!