రజనీది సామాన్యుల పార్టీ.. గుర్తు సైకిల్+పాల క్యాన్ !

సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఈ నెల 31 అఫిషియల్ ప్రకటన రానుంది. ఆరోజే పార్టీ జెండా, అజెండాని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా పార్టీ గుర్తుపై సన్నిహితులతో కలిసి కసరత్తు చేస్తున్నారు రజనీ. ఆ పనులు ఓ కొలిక్కి వచ్చాయి. రజనీ పార్టీ గుర్తు ఫైనల్ అయింది. ఆయన సైకిల్ గుర్తుని ఎంచుకున్నారు. సైకిల్ ఒక్కటే కాదు. దాని వెనక పాల క్యాన్ ఉండనుందని చెబుతున్నారు.

రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘అన్నామలై’ చిత్రంలో అభిమానులను ఎంతో అలరించిన సైకిల్, పాలక్యాన్, రజనీ గెటప్ ను చిహ్నంగా ఎంచుకున్నారని తెలిసింది. ఇక రజనీ పార్టీ జెండాలో మూడు రంగులు ఉండనున్నాయి. ఒకొక్క రంగుకీ ఒక్కో ప్రత్యేక ల‌క్ష‌ణం ఉండేలా ర‌జ‌నీ ప్లాన్ చేస్తున్నార‌ని, ఒక‌ట్రెండు రోజుల్లో పార్టీ జెండా, గుర్తుల‌పై ర‌జ‌నీ ఓ నిశ్చితాభిప్రాయానికి వస్తార‌ని తెలుస్తోంది. సైకిల్ గుర్తు తెలుగు రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి.. అతి తక్కువ కాలంలోని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పుడు ఆ రికార్డుని రజనీ బ్రేక్ చేయాలని చూస్తున్నారు. బహుశా.. అందుకే రజనీ కూడా సైకిల్ గుర్తుని ఎంచుకున్నారేమో.. !