కరోనా వాక్సీన్ సరఫరా.. స్పైస్ జెట్ రెడీ !
మహమ్మారి కరోనాకు త్వరలోనే వాక్సిన్ రాబోతుంది. ఏ దేశంలో మొదట కరోనా వాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. దానిని మిగితా దేశాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. వాటిని సురక్షితంగా సరఫరా చేయడానికి తాము రెడీ అని స్పైస్ జెట్ ప్రకటించింది. ఇందుకోసం సరుకు రవాణా సంస్థలైన ఓం లాజిస్టిక్స్, స్నోమన్ లాజిస్టిక్స్‌తో చేతులు కలిపింది.
కొవిడ్ వ్యాక్సిన్లను తరలించాలంటే మైనస్ 40 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. తమ వద్ద ఆ సదుపాయం ఉందని, నియంత్రిత ఉష్ణోగ్రతలో వాటిని తరలించే సామర్థ్యం తమకుందని స్పైస్‌జెట్ తెలిపింది. 54 దేశీయ, 45 అంతర్జాతీయ నగరాలతో అనుసంధానమైన స్పైస్‌జెట్ వద్ద 17 కార్గో విమానాలున్నాయి.
ఇక భారత్ మాత్రం స్వదేశీ టీకాపైనే నమ్మకం పెట్టుకుంది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా పరిశోధనలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని వారాల్లోనే కరోనా టీకా రానుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కరోనా టీకా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నామని తెలిపారు.