వెంకీతో నా స్నేహం ప్రత్యేకమైనది : పవన్

విక్టరీ వెంకటేష్ తో నా స్నేహం చాలా ప్రత్యేకమైనది అన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈరోజు వెంకీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. పవన్ కూడా వెంకీని విష్ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రకటనని విడుదల చేశారు. ఇందులో వెంకీతో అనుబంధం గురించి వివరించారు.

“తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేశ్‌తో నాకున్న స్నేహం ఎంతో ప్రత్యేకమైంది. నేను కథానాయకుడిని కావడానికి ముందు నుంచే ఆయనతో నాకు అనుబంధం ఉంది. తరచూ వెంకటేశ్‌తో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆయన మంచి చదువరి. ముఖ్యంగా ఆధ్యాత్మిక, ధార్మిక, లౌకిక సంబంధమైన పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. అందులో ఉన్న విషయాలు నాకు వివరించేవారు.

ఆ సంభాషణలు, చర్చలే మా స్నేహాన్ని దృఢపరిచాయి. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సినిమా విషయాలతోపాటు హైందవ ధర్మం, భక్తికి సంబంధించిన విషయాలు చర్చకు వస్తుంటాయి. ఆ స్నేహమే మేమిద్దరం ‘గోపాల గోపాల’ చిత్రంలో నటించేలా చేసింది. మా ఆలోచనలకు ఆ చిత్రం అద్దంపట్టింది. కొత్తతరం దర్శకుల కథలకు.. ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మలచుకొనే వెంకటేశ్‌ మరిన్ని విజయాలతో ప్రేక్షకులను మెప్పిస్తారని ఆకాంక్షిస్తున్నా”నని రాసుకొచ్చారు.