ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ చేరాయ్. సీఎం కేసీఆర్ మూడ్రోజుల ఢిల్లీ పర్యటనని ముగించుకొని ఆదివారం హైదరాబాద్ చేరిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ కి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. దీంతో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిగ్ ప్రపొజల్ పెట్టారని.. దాని గురించి చర్చించేందుకే బండి సంజయ్ ని ఢిల్లీకి పిలిచారనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షాతో బండి సంజయ్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత కేసీఆర్ పెట్టిన ప్రపోజల్ ఏంటీ ? అన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయ్.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ కోసం కొన్నాళ్లుగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.పిసిసి రేస్‌కు సంబం ధించి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్‌ నాలు గురోజుల పాటు గాంధీభవన్‌లో మకాం వేసి.. అభిప్రాయ సేకరణ జరిపి నివేదిక ఢిల్లీ తీసుకెళ్ళారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్లు కూడా ఛలో ఢిల్లీ అంటూ ఢిల్లీ బాట పట్టారు. పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డి ఇవ్వకుండా వీరంతా అడ్డుపడుతున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇస్తే.. తమదారి తాము చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది ? అన్నది ఆసక్తిగా మారింది.