గుడ్ న్యూస్ : ఈ నెల 25 నుంచి ఏపీలో కరోనా వాక్సీన్ పంపిణీ

అతి త్వరలో కరోనా వాక్సీన్ రాబోతుందని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మరో అడుగుముందుకేసిన ఏపీ ప్రభుత్వం ఈ నెల 25 నుంచే కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు 4,762 ఆరోగ్య కేంద్రాల్లో కోటి మందికి వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటికే కోటికి పైగా టెస్టులతో వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో రాష్ట్రం విజయం సాధించిందన్నారు. కరోనా పంపిణీపై ఇప్పటి వరకు కేంద్రం స్పష్టమైన తేదీని చెప్పలేదు. అలాంటిది ఏపీ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి కరోనా వాక్సీన్ పంపిణీ చేస్తామని ప్రకటించడం విశేషం.

ఇక ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 500 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 8,76,336కి చేరాయి. కొత్తగా 5గురు కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 7,064కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,09,37,377 మందికి కరోనా పరీక్షలు చేశారు. కొత్తగా 61,452 మందికి టెస్టులు చేశారు. ఏపీలో ఇప్పటివరకు 8,64,612 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ప్రస్తుతం ఏపీలో 4,660 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరోవైపు దేశంలో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణలో జనవరి 2వ వారంలో వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఆక్స్‌ఫర్డ్-ఆస్త్రాజెనెకా కంపెనీ తయారుచేసిన కోవిషీల్డ్ (CoviShield) వ్యాక్సిన్‌ను పంపిణీ చేయబోతున్నారు. ఈ టీకాను ముందుగా ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు, కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్లకు ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లో బేగంబజార్, శ్రీరాంనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోని స్టోరేజ్ సెంటర్లకు డోసులను తరలించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి అవసరమైన వారికి పంపిణీ చేస్తారు. ఇతర వ్యాక్సిన్ల లాగే… ఈ వ్యాక్సిన్ కూడా 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ దగ్గర నిల్వ చేయబోతున్నారు. తెలంగాణలో 2.67 లక్షల మందికి ముందుగా ఈ వ్యాక్సిన్ అందనుంది. రోజూ 100 మందికి టీకా ఇవ్వనున్నారు.