ఉచితంగా కరోనా టీకా.. కేబినేట్ ఆమోదం !

కరోనా టీకా బీహార్ ఎన్నికల అస్త్రం, హామీగా పని చేసిన సంగతి తెలిసిందే. ఉచిత కరోనా వాక్సిన్ అందిస్తామని బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్డీయే కూటమి హామీ ఇచ్చింది. ఇప్పుడీ ఈ హామిని నిలబెట్టుకునేందుకు అడుగుముందుకేసింది. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా అందించాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని కేబినెట్‌ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా అందజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతిపౌరుడికీ టీకా అందేలా మార్గదర్శకాలు రూపొందించాలని మంగళవారం ఆరోగ్యశాఖ అధికారుల్ని సీఎం నీతీశ్‌ కుమార్‌ ఆదేశించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. తొలుత వైద్యారోగ్య, ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి టీకా అందించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. తర్వాత వయస్సు, అనారోగ్య సమస్యల వంటివాటిని పరిగణనలోకి తీసుకొని ప్రాథమ్యాలను నిర్ణయిస్తామని వెల్లడించారు.