కేసీఆర్ ఉద్యోగాల భర్తీ మాట ఉత్తదే

ఎప్పుడూ లేనిది సీఎం కేసీఆర్ తెలంగాణలోని నిరుద్యోగుల గురించి ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఢిల్లీ టూరికి వెళ్లిన సీఎం కేసీఆర్.. వచ్చి రాగానే రాష్ట్రంలో ఏయే శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నది లెక్క తీయాలని అధికారులని ఆదేశించారు. వాటిని వెంటనే భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్స్ ఇచ్చేందుకు కసరత్తు చేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో కొలువుల జాతర మొదలుకానుంది నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదంతా ఎన్నికల జిమ్మిక్కు. వచ్చే గ్రాండ్యుయేట్ ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ మొదలెట్టిన ఆటని తెలంగాణ భాజాపా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల భాజాపాలో చేరిన విజయశాంతి సీఎం కేసీఆర్ పై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. 

తెలంగాణలో 50వేల ఉద్యోగాల భర్తీకి అవకాశమే లేదని ఆమె స్పష్టం చేశారు. అటు దుబ్బాకలోను, ఇటు జీహెచ్ఎంసీలో బీజేపీ దూకుడు దెబ్బకు కేసీఆర్ దొరగారికి ఒక్కసారిగా నిరుద్యోగులు గుర్తుకొచ్చారు. ఉద్యోగార్థులను ఆరేళ్ళుగా పూచికపుల్లలా తీసిపడేసిన సీఎం గారు ఆదరాబాదరాగా 50 వేల ఉద్యోగాల భర్తీ అంటూ పొలికేక పెట్టారు. 

మన ఉద్యోగాలు మనకు.. మన నీళ్ళు మనకు అంటూ ఎప్పుడో ఉద్యమకాలంలో నినదించి, అధికారపగ్గాలు అందుకోగానే ఆ విషయం మర్చిపోయారు. బీజేపీ విజయాలు కేసీఆర్ గారికి దడ పుట్టించి నిరుద్యోగులు జ్ఞాపకానికి వచ్చారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండేళ్ళుగా జోనల్ సిస్టంను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. టీచర్ల ఏకీకృత సర్వీసు అంశంలో కేంద్రహోంశాఖ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేదు.

సవరించిన జోన్లకు రాష్ట్రపతి ఆమోదం అవసరం. ఇవిగాక మరెన్నో చిక్కులు దీనితో ముడిపడి ఉన్నాయి.  ఇవేమీ తేలకుండా కొత్త పోస్టుల భర్తీ అంత తేలిక కాదు. నిరుద్యోగులను మరోసారి సీఎం కేసీఆర్ ధోకా చేయాలని ప్రయత్నిస్తున్నారు అంటూ వరుస ట్విట్స్ చేశారు రాములమ్మ.