మరో రెండు రికార్డులకు చేరువలో కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రెండు రికార్డులకు చేరువలో ఉన్నాడు. అడిలైడ్‌ మైదానంలో అత్యధిక పరుగులు సాధించిన నాన్‌ ఆస్ట్రేలియన్‌గా ఘనత సాధించడానికి 180 పరుగుల దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఆ రికార్డు వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ లారా పేరిట ఉంది. లారా 4 మ్యాచ్‌ల్లో 610 పరుగులు చేయగా, విరాట్ మూడు మ్యాచ్‌ల్లో 431 పరుగులు చేశాడు. 

కంగారూల గడ్డపై అత్యధిక శతకాలు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా దిగ్గజ క్రికెటర్‌ సచిన్ సాధించిన రికార్డును అధిగమించడానికి కోహ్లీ మరో సెంచరీ దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో 20 టెస్టులు ఆడిన సచిన్‌ ఆరు శతకాలు సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు సాధించిన జాబితాలో కోహ్లీ (70) మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్‌ (100), రికీ పాంటింగ్ (71) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మరో శతకం సాధిస్తే ఈ జాబితాలో పాంటింగ్‌తో కలిసి సమంగా రెండో స్థానంలో నిలుస్తాడు.