8వ విడత జీఎస్టీ రుణాలు విడుదల.. తెలంగాణ వాటా ఎంతో తెలుసా ?
కేంద్రం నుంచి రాష్ట్రాలకు పైసలొచ్చాయ్. తాజాగా కేంద్రం 8వ విడత జీఎస్టీ రుణాలని విడుదల చేసింది. మొత్తం రూ.6వేల కోట్లను విడుదల చేసింది. 23 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిధులు మంజూరు చేసింది. దీంతో ఇప్పటి వరకు కేంద్రం విడుదల చేసిన మొత్తం రూ.48 వేల కోట్లకు చేరింది.
ఇందులో తెలంగాణకు రూ.688.59 కోట్లు, ఏపీకి రూ. 1181.61 కోట్లు రుణాల కింద కేంద్రం విడుదల చేసింది. జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీకి పరిహారానికి బదులు కేంద్రం నుంచి రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలు అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక విండోను ఏర్పాటు చేసి రాష్ట్రాలకు కేంద్రం రుణాలు మంజూరు చేస్తోంది. అక్టోబర్ 23, నవంబర్ 2, నవంబర్ 9, నవంబర్ 23, డిసెంబర్ 1, డిసెంబర్ 7, డిసెంబర్ 14.. ఇలా మొత్తం ఏడు విడతల్లో ఇప్పటి వరకు రాష్ట్రాలకు కేంద్రం రుణాలు మంజూరు చేసింది.